Nandigama (U)(P) News

Posted by Bhhaskar on 03 Nov 2017 Views: 145

గుంటూరు జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ కూచిపూడి విజయ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ మాజీ చైర్మన్‌ కూచిపూడి సాంబశివరావు దంపతులు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు వీరితో కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం మరోసారి సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కూచిపూడి దంపతులు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కూచిపూడి సాంబశివరావు తొలినుంచి కాంగ్రెస్‌వాది.

గుంటూరులో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని జిల్లా కాంగ్రెస్‌ కమిటీలోనూ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలోనూ పలు కీలక పదవులు నిర్వర్తించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరొందిన సాంబశివరావు ఆయన నిర్వహించిన పాదయాత్రలో కూడా చివరివరకు పాల్గొని మరింత చేరువయ్యారు. అందువల్లే వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సాంబశివరావుకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. అంతే కాకుండా ఆయన సతీమణీ విజయకు స్యయంగా రాజశేఖరరెడ్డే ఫోన్‌చేసి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి ఆమెను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి రిజర్వు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన విజయను ఎంపిక చేయటం ద్వారా ఆ కుటుంబంపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

అంతేకాదు జనరల్‌ స్థానానికి కేటాయించిన కొల్లిపర జడ్‌పీటీసీగా విజయను పోటీచేయించి గెలిపించి తీరాల్సిందిగా అప్పటి దుగ్గిరాల (పునర్విభజనలో రద్దు అయింది) ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డికి హుకుం జారీచేసి గెలిపించి చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టే అవకాశం కల్పించారు. 2006 - 2011 వరకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా విజయ పనిచేశారు. వైఎస్సార్‌ పిలుపుతోనే విజయ అధ్యాపక వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకుమునుపు ఆమె ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బోటనీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా 15 ఏళ్ల పాటు పనిచేశారు.

రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు స్థాపించిన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. వైఎస్‌ఆర్‌ అంటే ఎనలేని అభిమానం ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాల మూలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి నక్కా ఆనందబాబు చొరవ తీసుకొని వారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. దంపతులిరువురూ టీడీపీలో చేరినా సాంబశివరావు ఆరోగ్యం సరిగా లేనందువల్ల విజయే క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.